ఇంతకీ మనకి ఏమైంది?--1


మనిషిని ఆరోగ్యంగా ఉంచే వాటిలో నవ్వు ఒకటి. నవ్వు ప్రాముఖ్యతని ఎప్పుడో గ్రహించిన మనిషి,నవ్వుతూ ఇతరులని పలకరించడం తన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకున్నాడు.నవ్వుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనిషికి తెలిసినంతగా వేరే యే ప్రాణికీ తెలియదు. నవ్వులో కూడా రకాలున్నాయండోయ్!! ఎవరి స్థాయినిబట్టి వారు నవ్వుతారనుకోండీ!! అది వేరే విషయం. కొన్ని సార్లు మనం కావలసి నవ్వినా, కొన్నిసార్లు మన ప్రయత్నం లేకుండానే నవ్వు వస్తుంది. నవ్వు ప్రాముఖ్యత తెలుసుకోబట్టే, ఇదివరకు రాజుల కొలువుల్లో రాజుగారిని నవ్వించడానికి విదూషకులు, హాస్య కవులు ఉండేవారు. హాస్య కవులు అంటే మన తెలుగు వారికి వెంటనే తెనాలి రామకృష్ణ కవి గుర్తు రారూ? నవ్వించడం అంటే అంత సులువు కాదండోయ్! ఎంత చతురత ఉండాలీ, ఎంత సమయస్ఫూర్తి ఉండాలీ? కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చెన్ పద్యం కానీయండీ, థ్ప్రువ్వట బాబా పద్యంలో చతురత కానివ్వండీ, యేనుగులని ఆస్తి పంపకం విషయంలో చూపిన సమయస్పూర్థి కానివ్వండీ రామకృష్ణ గారిని మర్చిపోగలమా? ఆ పాత్రలో అక్కినేని గారిని తప్ప వేరెవరినీ ఊహించుకోనూలేము కాదూ? ఇక సినిమాలలో హాస్య నటులూ, వాళ్ళు పోషించిన హాస్య పాత్రలగురించి చెప్పాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది. ఈ టాపిక్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. 

అసలు ఇంతకీ నా యెదలోకి నవ్వు విషయం ఎందుకు వచ్చిందబ్బా? మరేం, ఓ పాత మిత్రుడి ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళటం జరిగింది. అంతా బాగానే ఉంది. బాగానే రిసీవ్ చేసుకున్నాడు, ఆత్మీయంగా కావిలించుకున్నాడూ, అందరినీ పరిచయం చేశాడూ, వాళ్ళూ బాగా కలసిపోయారు. కానీ యేదో మిస్ అయిన ఫీలింగ్! తర్వాత అర్ధం అయ్యింది. వాళ్ళల్లో నవ్వు మిస్ అయ్యింది. ఎక్కువగా గంభీరంగా ఉన్నారు.నవ్వుతున్నారు గానీ, ఏదో కంట్రోల్ద్ గా నవ్వీ నవ్వనట్లు. ప్రోగ్రాం చేయబడినట్లు. మనకా నవ్వడం, నవ్వించడం పుట్టుకతోనే అంటుకుపోయింది. నేను ఏదో జోక్ వేస్తే నా మిత్రుడు మనసారా నవ్వలేకపోయాడు. పెదాలు విరిచి నవ్వినట్లుగా చేశాడు కానీ, మనస్ఫూర్తిగా నవ్వినట్లు లేదు. 

ఎందుకని మనం మనసారా నవ్వలేకపోతున్నాం? ఎందుకని మనం జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నాం? నవ్వితే ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ కెమికల్ రిలీజ్ అవుతుందనీ, నవ్వడం వలన, ఎన్నెన్నో ఆరోగ్య మరియూ మానసిక ప్రయోజనాలు ఉన్నాయనీ తెలిసీ మనం నవ్వలేకపోతున్నాం.యెవరిని చూసినా, గంభీరమైన ముఖకవళికలు, ఎంతో భారం మోస్తున్నవారిలా దిగజారిన, జీవం లేని ముఖం! యెందుకిలా? యేమైంది మనకి?

చెప్పాలంటే చాలావుంది. ఇంతకీ ఈ మనిషి ఏమిటీ, ఏదో బోధిస్తున్నట్లుంది? అనుకుంటున్నారా? ఎబ్బే! అదేమీ కాదు. నాలో సుడులు తిరుగుతూ, మధిస్తున్న మాటలు మీతో పంచుకోవడం అంతే!! మరేమీ కాదు.

అందుకే.......

(ఇంకావుంది).


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు