పాపం భర్తలు-1!!
వణక్కం!!
హమ్మయ్యా!! ఎట్టకేలకు వచ్చారు! వస్తారో రారో అని ఒహటే ఇది అన్నమాట! ఎందుకంటారేమో? ఆడియన్స్ లేపోతే ఎవరికి చెప్పుకుంటామండీ మన అంతఃరంగంలో గిరికీలు కొడుతున్న ఆలోచనలు?
యాక్చువల్ గా ఇవాళ మీకు మాంఛి మషాళా కధ చెబుదామనుకున్నానా?! ప్రిపేరైపోతున్నానో లేదో లోపలినుంచి భర్త అంతఃరాత్మ గారు నిచ్చెనేసుకుని బయటకి దిగారు! మరేం! అంతఃరాత్మల్లో కూడా రకాలుంటారు! తండ్రి అంతఃరాత్మ, భర్త అంతఃరాత్మ, కొడుకు అంతఃరాత్మ! ఇలా రకాలు ఉంటాయి! సమయానుసందర్భంగా బయటికి వచ్చి, వాళ్ళ గోడు/గోల తో మన బ్రతుకు అల్రెడీ అయిపోయినదాన్ని మరింత బస్టాండు చేస్తారు! బయటికి రానప్పుడు లోపల వాళ్ళ లెవెల్ ఆలోచనలు చేస్తూ ఉంటారు! అదన్నమాట!
సో, ఈ భర్త ఆత్మగారు ఏమన్నారంటే "మొన్న మూర్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తన భర్తబాధలు నీతో వెళ్ళబోసుకోలా? ఈ విషయాల గురించి నీతో బ్లాగానుసంధమైన మిత్రుల చెవిన వేయాలనుకున్నావు గదా? ఆ విషయాలు చెప్పరాదూ? నాకూ కొద్దిగా శాటిస్ఫ్యాక్షన్ ఉంటదీ! " అన్నారు! ఇక తప్పేదేముందీ సరేఅన్నా!
అందుకనీ అదే మాట్లాడుకుందాం మనం!
మొన్నామధ్య మూర్తి తన పెళ్ళిరోజు ఘనంగా జరుపుకున్నాడు. చాలామంది మిత్రులు నాలాగే ఫ్యామిలీ తో వచ్చారు. అంతా ఘనంగానే జరిగింది గానీ, మధ్యలో మూర్తి ఏం చేశాడో తెలీదుగానీ, వాళ్ళావిడ గొంతు సన్నగా చేసి ( అయినా అందరికీ వినబడ్డది లెండి!) నవ్వు మొహంతోనే ఛెడామడా చెరిగింది! అక్కడితో ఆగిందా? అదే పని వాళ్ళ అన్నయ్య అయితే ఎంత వైనంగా చేసేవాడో, అదృష్టమంటే వాళ్ళ వదినదేననీ, సోదాహరణంగా వివరించింది. ఇహనేం? మూర్తి మొహం మాడిపోయిన అప్పడంలా మారిపోయింది! అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు, అన్న చందాన మేమంతా ఉండడంతో మరింత ఎక్కువే మాడింది! రాజేశ్వరిగారు అనీ మా ఆవిడ తరఫు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. ఆవిడ మాటలతోనే నవ్విస్తారు. ఆ మధ్య ఆవిడ ఓ పెళ్ళికి వెళ్ళిందట! వెళ్ళొచ్చాక, ఎవరో అడిగారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకచూట్టానికి ఎలా ఉన్నారని! దానికి ఆవిడ " పెళ్ళికూతురికేమీ చక్కగానే ఉంది కానమ్మాయ్, పెళ్ళికొడుకే మరీ వారం క్రితం చనిపోయినాడికి మల్లే ఉన్నాడు" అంది. ఆ పోలికకి అందరూ నవ్వలేక చచ్చారు! మా మూర్తి ఫేస్ అప్పుడు ఆవిడగానీ చూసిఉంటే ఎలా పోల్చేదో అనుకుని నవ్వుకున్నా!! తర్వాత ఓ గౌరవ సిట్టింగ్ లో (అంటే మనం మందులో పాల్గొనం కానీ, సంభాషిస్తామన్నమాట!) మూర్తి తన గోడంతా మొరపెట్టుకున్నాడు! ఏతావాతా మూర్తే కాక, మరికొంతమంది గోడు విన్నాక( అందులో నేను కూడా ఉన్నానా? ఏమో పై వాడికే తెలియాలి!), నాకు ఈ సదరు భర్తల గోడు పై ఓ అవగాహన కలిగింది!!
ఏమండోయ్! ఈ కాస్త వినడానికే అప్పిరి తిప్పిరి అయిపోతే ఎలా? ఇంకా చాలా ఉంది మరి! ఏవిటీ? రేపు వింటారా? అలాగే కానివ్వండి! మరీ, రేపు కలుద్దాం!
(ఇంకా ఉంది)
బాగుంది 👌
రిప్లయితొలగించండిధన్యవాదాలు!
రిప్లయితొలగించండిఎంతయినా భర్తలం కదా.
రిప్లయితొలగించండిమన ఘోస మనకే అర్థం అవుతుందిలే