ఇంతకీ మనకి ఏమైంది ?-2
హల్లో
చిరునవ్వుల శుభోదయం!
ఎంత బాగుందీ నవ్వు! ఎవరైనా అంత నిష్కల్మషంగా నవ్వగలిగితే ఎంత బాగుంటుందీ అనిపిస్తుంది నాకు మట్టుకు!!
నవ్వు గురించి మాట్లాడుకుంటున్నాము కదా?
మనం జీవితాన్ని ఎలా చూస్తున్నామో, ఎలా అనుభవిస్తున్నామో, ఎలా మనకి అన్వయించుకుంటున్నామో, దానిని బట్టి మనం ఉంటాము. మన మనసులోని ఆలోచనలే మన మొహంలో ప్రతిఫలిస్తాయి. మనం నిత్యం ఒత్తిడిలో బ్రతుకుతున్నాము. ఉద్యోగం గురించి ఒత్తిడి, సంపాదన గురించి ఒత్తిడి, భార్యాభర్తల రిలేషన్ గురించి ఒత్తిడి, పిల్లల చదువు గురించి ఒత్తిడి, వాళ్ళ భవిష్యత్తు గురించిన ఒత్తిడి, మన ఆరోగ్యం గురించి ఒత్తిడి, మన తిండి గురించిన ఒత్తిడి ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఒత్తిళ్ళు. ఎందుకిలా?
ఏమైంది మనకి?
ఎందుకంటే, మనం రేసులో ఉన్నాం.
ఎందుకంటే, మనం సంతృప్తి అనేదే మర్చిపోయాం.ప్రతీదానికీ ఒక హద్దు అంటూ ఉంటుంది. ఆ హద్దులు దాటేశాం. నిత్యం రేసులో ఉంటున్నాం. సంపాదనకి రేసు. సొంత ఇంటిని ఇతరులకంటే ఎంత గొప్పగా కట్టగలమా అనేదాంట్లో రేసు. పిల్లలకి ర్యాంకులొస్తే చాలదు. ఇంకేదో కావాలి. మనం పరిగెడుతూ, పిల్లలని పరిగేట్టేలా చేస్తున్నాం. మనదగ్గర ఎంత గొప్ప కారు ఉందో అన్నదాంట్లో రేసు.పిల్లలకి ర్యాంకులు రావాలనుకోవడం తప్పు కాదు. వాళ్ళు జీవితంలో పైపైకి వెళ్ళాలనుకొవటం తప్పు కాదు. మన తాహతు ఏమిటో మనకు తెలుసు. మన పిల్లల అకాంక్షలేమిటో మనకి తెలుసు. అయినా, మనమూ మన పిల్లలూ ఇతరులని అందుకోవాలని పరుగు. అసలు ఈ పరుగులో నెగ్గాలంటే మంచి ప్రణాళిక ఉండాలి, క్రమశిక్షణతో, పట్టుదలతో ఏకైక ధ్యేయంతో ముందుకు సాగాలి. తెలివిగల వారు, కఠిన దీక్షతో ముందుకు సాగగలిగేవాళ్ళు మంచి నాణ్యమైన విద్య పొందగలుగుతారు! జీవితంలో ఉన్నత శిఖరాలు అందగలుగుతారు. వాళ్ళై గురించి చెప్పుకోవడానికేమీ లేదు వీలైతే అనసరించి సాధించడం తప్ప! మనం చెప్పుకునేది అలాంటి వాళ్ళ గురించి కాదు! శ్రమ పడలేనివారి గురించి! చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేనివారి గురించి! ఓ ధ్యేయం లేనివాళ్ళ గురించి! ఇలాంటివాళ్ళకు ఎందులో ఆసక్తి ఉందో తల్లితండ్రులు తెలుసుకోవాలనుకోరు! ఎలాగైనా ఏ డాక్టరో, ఇంజినీరో చేసేయాలనుకుంటారు! ఇలాగే ఓ మిత్రుడికి వాళ్ళ అబ్బాయిని ఎలాగైనా ఇంజినీరుని చేయాలని పట్టుదల! ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలియదు. చెప్పే అవకాశం మనం ఇస్తేగా? మన గోలే మనది!!? ఇంతా చేస్తే ఏ ఎంట్రెన్స్ లోనూ సీటొచ్చేంత ర్యాంకు రాలేదు, అయినా వాడి నాన్న, అదే నా మిత్రుడు, విక్రమార్కుడి వేషమేసుకుని, కొన్ని లక్షలతో ఓ ఊరూ పేరూ లేని కాలేజీలో (కాంపిటీషన్ మరి! ఏం చేస్తాం? అందరూ ఇంజినీర్లే అయిపోవాలి! మరే! మనలో మాట! డాక్టరుకో, ఇంజినీర్ కో, ఐటీ ప్రొఫెషనల్స్ కో మాత్రమే పిల్లనిస్తామంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు ! వీళ్ళేంచేస్తారు పాపం? తప్పదు మరో!!) మేనేజ్మెంట్ కోటా సీటు కొనిపెట్టాడు. అది పూర్తి అవడానికి మరికొన్ని లక్షలు!! చివరికి ఏదో అయిదనిపించి బయటికి వచ్చాడు! అయినా ప్రతిభ ఏదీ? కాలేజికి కూడా పెద్దగా పేరు లేదాయే! ఖాళీగా ఉంటున్నాడు! వాళ్ళ నాన్నేమో అప్పుల్లో మునిగి తేలుతున్నాడు!
ఏ పరుగులో ఏమి కోల్పోతున్నామో కోల్పోయిన వాళ్ళకే తెలుసు. మన మొహంలో నవ్వు మాసిపోయి, కనుమరుగై మనం దిగులుగా, విచారంగా, భారంగా బ్రతుకు ఈడుస్తూ.
ఎందుకు?
ఇంకొక సమస్య ఏమిటంటే, మనం పరుగులో పడి మన జీవితాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో, ఒక పౌరుడిగా మన బాధ్యతలని కూడా అంతే నిర్లక్ష్యం చేస్తున్నాం!
నిజం కాదా?
నిజమేకాదు.
(ఇంకా ఉంది!!)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి