గతమే బాగుండేది!! #telugu blogs #humour #funny
హలో హలో!!
ఎప్పిడి ఇరిక్కింగే? ఇరుకు అంటున్నారు అంటే ఏమిటంటారా? అబ్బే ఏమీ లేదండీ!! చాలాకాలం తర్వాత కలిశాం కదా? తమిళంలో ఎలా ఉన్నారు? అంటున్నా! తమిళంలో బాగుండి తెలుగు లో బాగో కుండా ఉంటామా? అంటారా? అగ్రీడ్!! ఏవో ఈతి బాధలతో మిమ్మల్ని ఈ మధ్య కలవలేకపోయా! క్షంతవ్యుణ్ణి!!
తీరిగ్గా భోంచేసి, మీతో మాట్లాడాలని కూర్చున్నా! కూరేమో దోసకాయ పప్పు! దరిద్రంగా ఉంది!! మా ఆవిడకి వంట రాదంటారా?? అబ్బెబ్బే!! కాదు! కాదు! గట్టిగా అని నా కొంప ముంచుతారా ఏమీ? కారణం ఆవిడకాదు! ఇప్పుడు మనం తింటున్నది చెత్తే అని చెప్పాలి. ఇదివరకటి కూరగాయలెక్కడున్నాయీ!? ? అన్నీ సంకర జాతి కూరలే కదా? యూరియా వేసి, ఇంకేవేవో వేసి ఇంతింత లావున కూరగాయలు పండిస్తే బరువైతే తూగుతాయి కానీ, రుచి ఎక్కడినుండి వస్తుందీ? మా అమ్మమ్మ వంటలు బాగా చేసేది! ఆవిడ దోసకాయ పప్పు వండినా, ములక్కాయ పప్పుచారు చేసినా, వాసన ఆ పరిమళం వీధి చివర ఉండే మా పెదనాన్న ఇంట్లోకి చేరేది! ఆయన చేతి కర్ర పట్టుకుని బయలుదేరి, మా ఇంటికొచ్చేసి "ఏమిటమ్మాయ్! ఇవాళ ములక్కాడ చారు అదిరినట్లుందే?"అంటూ లొట్టలేస్తూ అరుగు మీద బైఠాయించేవాడు! ఠాప్! ఠాప్! ఇప్పుడు ఈ లొట్టలు నావే!! హిహీహీ!! (కార్టూనిస్ట్ మల్లిక్)!! ఆ రోజుకు ఆయన భోజనం ఇక్కడే! అప్పట్లో ఆ ప్రేమలు, ఆ రిలేషన్సు వేరనుకోండీ!! ఇప్పుడు ఆ రిలేషన్సు ఎక్కడున్నాయీ! ఆన్నీ ప్లాస్టిక్ నవ్వులూ, దూరాలేగా?
అరుగంటే గుర్తొచ్చింది. అరుగులెంత బాగుంటాయో కదా? అవి మనుషుల్ని కలిపేవి! అరుగు మీద కూర్చుని వీధిలోకి చూస్తుంటే టివీ వీక్షణం లాగా వచ్చేపోయే రకాల మనుషులు, వాళ్ళ పలకరింపులు! ఎంత బాగుండేది? ఇప్పుడో? పలకరింపులు లేని, మానసిక జబ్బులతో కుళ్ళుతున్న ఒంటరి బ్రతుకులు! అప్పట్లో వంటరితనం అంటే ఎవరికీ తెలియదు! చుట్టూ బంధువులూ, బంధువుల్లాంటి మితృలూ, ఆప్తులూ!! ఇప్పుడు కన్నవారికి కూడా పలకరింపు కరవే?
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!! గతమెంతో ఘనకీర్తి కలవోడా!! ప్చ్! ఇప్పుడేదా ఘనకీర్తీ?? ఏంటోనండీ! మనసు వికలమైపోయిందండీ! మళ్ళీ మాట్లాడతాలెండి!!
ఉంటానూ!
ఎక్కడేమిటండీ బాబూ!! ఇక్కడే! ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే ముగిసిపోయేదా ఏమిటీ?? కాదూ!
శె లవ్!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి