బాబోయ్ అప్పు!
శుభోదయం!! సలాంవాలేకుమ్! సత్శ్రీఅకాల్!
తెల్లారింది, సూర్యుడు అప్పులాడిలాగా ప్రొద్దున్నే పడమట తిష్టవేసుకుని కూర్చున్నాడు! నేనూ మీతో మాట్లాడాలని తిష్ఠ వేసుక్కూర్చున్నా!
పాపం సూర్యభగవానుడు వెలుతురు పంచడానికి వస్తే అప్పులాడితో పోలుస్తావా పుండాఖోర్!? అంటున్నారు అంతరాత్మగారు! (అదుర్స్ సినిమాలో అనుకుంటా ms నారాయణ ఆత్మలాగా బ్రహ్మానందం తో ఆడుకుంటారు! సరదాగా ఉంటుంది!) ఇంతకి నాది తప్పేలేండి!
అసలు అప్పు అన్నది చిన్నవిషయమేమీ కాదు మరి! ఇవాళ చిన్నా చితకా ప్రజల దగ్గర్నుంచి, ప్రభుత్వాలదాకా అప్పుచేసేవారే! దాన్ని మనం అఫెండ్ కాకుండా బ్యాంకులు లోన్ అని ఓ ముద్దు పేరు పెట్టేరు! పేరేదైనా తత్వం ఒకటే! పిండటం! ( అవసరానికి డబ్బు ఇస్తుంటే మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదు, వేరొకరు వినరాదు!! ముఖ్యంగా బ్యాంకులవాళ్ళు!! ఎందుకంటే అదేదో.....ఏమిటదీ...? ఆ! ....సిబిల్ స్కోరు బాలేదని అప్పివ్వరు!! జాగ్రత్త!! ). అప్పు మధ్యతరగతివాళ్ళు, బీదవాళ్ళు చేస్తే న్యూనత, కోటీశ్వరులు, ప్రభుత్వాలు చేస్తే ఘనత! ఈ మధ్య ఆయనెవరో బ్యాంకుల్లో బోలెడంత అప్పుచేసి, సగర్వంగా విదేశాలకెళ్ళిపోయారు! మనం అలా చేయగలమా? ఒహవేళ చేసినా, అది తీర్చేదాకా మనకి కల్లోకూడా అప్పులోడే వస్తాడు నిద్ర ఎలా పోతావో నేనూ చూస్తా అన్నట్లుగా! అప్పువల్లే కదా హరిశ్చంద్ర చక్రవర్తి గారు భార్యాబిడ్డల్ని తాకట్టు పెట్టాల్సివచ్చింది?? ఆయన సిబిల్ స్కోరెంతో మీకెవరికైనా ఐడియా ఉందా?
అప్పు లేకుండా సగటు తెలుగువాడికి తెల్లారదని శెలవిస్తారు ముళ్ళపూడివారి అప్పారావు గారు! అప్పారావు గారి దృష్టిలో హలో అంటే ఓ ఫైవ్ రుపీస్ ఉందా?/ఉంటే ఇవ్వమని అర్థం! మా రోజుల్లో అయిదు రూపొయలకి ఎంత వేల్యూ ఉండేదో? ప్చ్!! ( కొంపదీసి ఇందుకేనేమో ఇందాక విజయరామ్ ని హలో అంటే తననికాదన్నట్లు వెళ్ళిపోయాడూ?). ఏమిటో?
అప్పులు ఇప్పుడే కాదు పూర్వకాలంనుంచీ ఉన్నవే! ఇప్పుడంటే బ్యాంకులు, ఇండివిడ్యుయల్సూ, ఇంకా ఎవరుబడితే వాళ్ళు అప్పులిస్తున్నారు గానీ, ఇదివరక అప్పులిచ్చీ వడ్డీలు గుంజే పని మార్వాడీలు, పఠాన్లు చేసేవారు! పఠాన్లకి ఇంకో పేరు కాబూలీవాలా! వడ్డీ ఇచ్చి అప్పు ఎంత కాలానికి తీర్చకపోయినా పఠాన్ ఏమీ అనేవాడుకాదుగానీ, వడ్డీ ఫస్ట్ వీక్ లో అందకపోతే మనవాళ్ళ కాలర్ పట్టేసుకునేవాడు! మనవాళ్ళకసలే నామోషీ! అయినా తప్పేదేముందీ? వచ్చీరాని హిందీలో గడువు అడుక్కునేవాళ్ళు! కాబూలీ చేతిలో చిక్కుకోవడం అంటే ఊబిలో చిక్కుకోవడమే అని మా చిన్నప్పుడు చెప్పుకునేవారు! అందుకే కన్స్యూమర్ ని కాబూలీవాలా/మార్వాడీలనుంచి ప్రొటెక్ట్ చేయడానికి, అప్పులివ్వడంలో లాభాలు గ్రహించీ, బ్యాంకులు నానా అప్పులిచ్చేస్తున్నాయి! ( "అయినా లాభమేముందీ? పొయ్యిలోనుంచి పెనం మీద పడ్డట్టయింది కాదూ? మనకి రిలీఫ్ ఎక్కడుందీ? ఇంతకన్నా కాబూలీవాలాయే నయం! సగం హిందీ సగం తెలుగులో బ్రతిమాలుకుంటే కనికరిస్తాడు! "--లోను బాధితుడు మిత్రుడు జ్ఞానేశ్వర్) మీరు ఇలా డీస్ట్రబ్ చేస్తే నేను ఎటో వెళ్ళిపోతాను! మరి మీ ఇష్టం!
అబ్బే సాంతం ఆ వెళ్ళిపోవడం కాదండీ బాబూ!! టాపిక్ లో అన్నమాట!
అయినా జ్ఞానేశ్వర్ చెప్పిందాంట్లోనూ వాస్తవం ఉంది! ఇంటిలోన్లు, వెహికల్ లోన్లు కట్టలేని/కట్టని వారినుంచి వసూలుచేయడానికి బ్యాంకులు రికవరీ ఏజెంట్లు అనబడే థర్డ్ పార్టీలని ఎంగేజ్ చేసుకుంటారు! వాళ్ళు కాబూలీవాలాకన్నా గట్టిగా పట్టుకుంటారు మన చొక్కా! పరువుపోయాక ఇంకెందుకూ? ఎందు "లోనో" పడిపోతే పోలా అనుకునేవాళ్ళూ ఉన్నారు! ( వంశీగారు క్షమించాలి! లింగంబాబు లవ్ స్టోరీ డైలాగ్ వాడినందుకు!) ప్రభుత్వాలు కూడా బ్యాంకుల అప్పుల్ని మాఫీ చేస్తాయికానీ, మన అప్పులు మాఫీ చెయ్యవే? బ్యాంకులు కూడా తక్కువ తినలేదు! పెద్ద పేద్ద వాళ్ళందరికీ అప్పులిచ్చేసి, వాళ్ళు అటూ ఇటూ సర్దుకున్నాక మొండిబకాయిలక్రింద రైట్ ఆఫ్ చేసుకుంటారు! జ్ఞానేశ్వర్ ఏడ్చాడంటే ఏడవడూ?
బయటినుంచి ఎవరో హలో, హలో! అంటున్నారు! అప్పు తీసుకోవటమే గానీ, ఇవ్వటం నాకు అలవాటు లేదని చెప్పొస్తాను! అందాకా ఎటూ కదలకండి! ఎందుకా?
(ఇంకా ఉంది!) అందుకూ!!
అప్పిచ్చువాడు ధన్యుడు సుమతీ.
రిప్లయితొలగించండి