నవ్వు- మనం --1

 మ్.. మ్ ..మ్! 

అదిగో! చూశారా మళ్ళీ కలిశాం! కలవటం, విడిపోవటం మరల కలవటం ఇంతే గదా మిత్రులతో? 

కలవటం అంటే అదొక విస్తారమైన వ్యవహారం! మనం మనుష్యులని రకరకాలుగా, రకరకాల సందర్భాలలో, రకరకాల అవసరాలకోసం, పలు రకాల మానసిక స్థితులలో కలుస్తాం! కొంతమందిని కలిస్తే పెదాలు చిరునవ్వుతో విచ్చుకోవడమూ, కొంతమందిని కలిస్తే  అయిష్టంతో, చిరాకుతో, పెదాలు బిగుసుకోవడమూ జరుగుతుంది! అనుకోకుండా ఇష్టమైన వ్యక్తులు కలిస్తే సంభ్రమాశ్చర్యాలతో కళ్ళూ, నోరూ ఇంత తెరుచుకుంటాయి! ఇష్టంగా కలుసుకోవడమూ, కలుసుకోవడాన్ని ఇష్టపడటమూ బాగుంటాయి! మొత్తానికి ఈ సందర్భాలలో నవ్వు చెరగదు మొహంలోంచి! చిన్నప్పుడైతే ఇద్దరు మిత్రులం కలిస్తే, కబుర్లు, నవ్వులు! అస్సలు తరిగేవి కాదు! ప్రతి చిన్న విషయానికీ నవ్వు ముందుండేది! అమ్మాయిలకి నవ్వెక్కువ! ఒకోసారి వాళ్ళెందుకు నవ్వేవాళ్ళో మాకు అర్థమై చచ్చేది కాదు! 

విజయరామ్ అని చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు! సౌమ్యుడూ, అమాయకుడు! ఆరో తరగతినుంచీ స్నేహం మాది! ఇంటర్ వరకూ కలిసే వున్నా, డిగ్రీ లో విడిపోయాం! అయినా టచ్ లోనే ఉన్నాం ఇప్పటికీ! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వాడికి నవ్వెక్కువ! ప్రతి చిన్నదానికీ తెగ నవ్వేవాడు!! ఎక్కడున్నా ఆఖరికి క్లాసు లో పాఠం జరుగుతున్నా సరే ఏదో చెప్పి నవ్విస్తే నవ్వు ఆపుకోలేకపోయేవాడు!నవ్వు మొదలైతే ఇక ఆగేది కాదు వాడికి. ఇది అలుసుగా తీసుకుని ఏదైనా చేసిగానీ, ఎవరినైనా అనుకరించి గానీ నవ్వించేవాళ్ళం! పాపం టీచర్లు/లెక్చరర్లు తెగ తిట్టేవారు! అయినా మామీద కోపం తెచ్చుకునేవాడు కాదు! నవ్వేసేవాడు. 

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతే మనసారా నవ్వుతున్నామా అంటే ఏమో? తెలియదు. వాడూ కొంత మారాడు గాని, ఆ నవ్వు పూర్తిగా పోలేదు. ఇప్పటికీ కొన్ని విషయాలలో నవ్వు ఆపుకోలేడు. నాకూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఇష్టం! ఒకోసారి ఆ నవ్వులే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయా అనిపిస్తుంది నాకు! అది కాక ఇంకోటుంది! మాకు ఏ విషయంలోనూ పెద్దగా అసంతృప్తి లేదు! ఉన్నవాటిని అలాగే స్వీకరించాం అందుకే  సంతోషం ఇంకా మమ్మల్ని వీడిపోలేదనిపిస్తుంది! సంతోషంగా నవ్వే నవ్వుకు సాటివచ్చేదేమైనా ఉందా?  

మీరే చెప్పాలి! 

అంత వరకూ విరామం మాత్రమే ! 

అయిపోలేదు!

(ఇంకా ఉంది!)

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు