జ్ఞానదంత ఉదంతం!
డిగ్రీ చదివే రోజుల్లో సంగతి. చాన్నాళ్ళుగా జ్ఞానదంతం బాధ పెడుతూ వచ్చింది. అది పూర్తిగా బయటకు రాకపోవడంతో చిగురులో ఖాళీ ఏర్పడింది. ఇక తరచూ అందులో ఆహారం ఇరుక్కోవటం, చిగురు వాచి కుడిపక్క దవడ జామ్ అయిపోతే తినడం కష్టంగా ఉండేది!
సరే, ఇహ లాభంలేదనీ మా క్యాంపస్ డాక్టర్ బేదీ గారి దగ్గరకి వెళ్ళా! ఈ జ్ఞానదంతం ఇబ్బంది పెడుతోందనీ దాన్ని తీసేయండి అని అడిగా! (ఇక్కడ ఈయన గురించి కొద్దిగా చెప్పాలి! ఈయనకి చాదస్తం, షార్ట్ టెంపర్ ఉన్నయ్! ఈయనతో మాట్లాడటమే కత్తిమీద సాము లాంటిది.) ఇలా అనంగానే ఈయన అంతెత్తున లేచి, ఇంకా నేనెందుకూ? నువ్వే లాగేసుకోపోయావూ? అన్నాడు. నేను బిక్క చచ్ఛిపోయాను! చివరకి శాంతించి ఏవో మందులు వ్రాశాడు, తగ్గింది. నెలన్నరకో ఏమో మళ్ళీ దవడ వాచింది. ఈయనతో లాభంలేదు. మరి ఎలా?? యూనివర్సిటీ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ కి వెళ్ళమని ఎవరో సలహా ఇచ్చారు.
ఇదేదో బాగుందే అనుకుని మిత్రుడు విజయానంద్ ని తీసుకుని డెం.కా.హా కి వెళ్ళా. ఓ సీనియర్ డాక్టర్ ఎక్స్ రే తీసి ఇన్ఫెక్షన్ క్రిందికి వెళుతూందనీ, మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లెమ్ రావొచ్చనీ కాబట్టి తీసేయాలన్నారు. రోగీ పాలే కోరుకున్నాడూ, వైద్యుడూ పాలే తాగమన్నాడు. ఆనందించి సరే అన్నాను. ఆయన ఓ రెసిడెంట్ సర్జనో, ఫైనలియర్ స్టూడెంటో తెలియదు గానీ ఓ అమ్మాయిని పిలిచి ఇతని కేస్ అటెండ్ అవ్వమన్నారు. ఆ అమ్మాయి చక్కగా అందంగా ఉంది. మహారాష్ట్రియన్! నేమ్ ప్లేట్ చూసి పేరు సంపాయించాం. రాజశ్రీ దేశ్ ముఖ్. అచ్చు షబానా ఆజ్మీలా ఉంది. ఆ అమ్మాయిని చూసి గుండె గతి తప్పింది. ఇక ఆవిడ పన్ను బదులు నాలుక తీసినా తెలిసేది కాదేమో!?
మొత్తానికి సక్సెస్ ఫుల్ గా పన్ను తీసేసీంది. ఇక లేవచ్చు అంటే లేవబోతే కళ్ళుతిరిగాయి. ఆ అమ్మాయి కంగారుపడి పడుకోబెట్టింది. ఆ సీనియర్ గారొచ్చి అది సైకలాజికల్ గా ఏదో పోగొట్టుకొన్నట్లు అన్పించి అలా అవుతుందట!
" ఆ పిల్ల డాక్టర్ ని చూసి మీకు మైకం కమ్మింది గురువుగారూ!" అంటాడు మా విజయానంద్! నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు!మా ఇద్దరి కాలేజీలు దూరదూరంగా ఉండటంవలన ఆ షబానాఆజ్మీ నెమ్మదిగా మైండ్ లోంచి మాసిపోయింది! నిజంగానే మర్చిపోయానా? ఏమో!!
బాగానే ఉంది గానీ, ఆరోజు రాత్రంతా నరకం కనబడింది. బిళ్ళలు పనిచేయలా, బ్లీడింగూ! మరుసటి రోజు ప్రొద్దునకి దవడ తెరవడం కష్టమైంది. ఆరోజు మా ఫ్రెండు ఒకడిది బర్త్ డే! పార్టీ ఉంది. మందూ, చికెనూ! ఎలా వద్దనేదీ? కానీ వెళ్ళి ఏంచేసేదీ? అర్థం కాలా!!
ఎలా?
పార్టీకి వెళ్ళటానికి టైము ఇంకాఉంది!!
మరేం!
(ఇంకాఉంది).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి