పరిచయం!
ఉషోదయం!!
అందరికీ నమస్కారం
నా పేరు రాజశేఖర్ గుంజా. చదివింది సివిల్ ఇంజనీరింగ్. ప్రస్తుతం మార్కెట్ రీసెర్చ్ లో ఫ్రీలాన్స్ మోడరేటర్/రీసెర్చ్ కన్సల్టెంట్ గా చేస్తున్నాను. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, రచన, గార్డెనింగ్ ఇష్టమైన విషయాలు! కాకపోతే దేనిలోనూ మాస్టర్ కాదు. రోజులో కనీసం ఒకసారైనా పాటలు వినకుండా ఉండలేను. సాఫ్ట్ మెలోడీస్ ఎక్కువగా ఇష్టం!
బొమ్మలు గీస్తాను కానీ ఇంకా పరిపక్వత రాలేదు. బాపు, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్ (చందమామ), చంద్ర, బాలి, ఇష్టులు. హాస్యం అంటే చెవి కోసుకుంటాను. క్లాసికల్ మూవీస్ ఇష్టం! అయినా అన్ని రకాలూ చూస్తాను. కార్టూన్స్, కేరికేచర్స్ తప్పక చూస్తాను. చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవటం అలవాటు. అభిమాన రచయిత/రచయిత్రు ల లిస్టు వ్రాస్తే చాంతాడంత! మనసును కదిలించే/ ఆలోచింపజేసే ఏ రచనయినా ఇష్టం!
తెలుగు భాష అంటే చాలా మక్కువ!!
ఈ బ్లాగ్ మొదలుబెట్టడానికి కారణం ఏమంటే, ప్రతీమనిషి మనస్సూ ఓ అఖాతం లాంటిది. అది ఎంతో లోతు. నిత్యం ఆ మనస్సులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. సాధారణంగా వాటిని మిత్రులతో ఆప్తులతో పంచుకుంటాం! పంచుకున్నప్పుడే ఆ ఆలోచనలు ఎలాంటివీ, వాటి యొక్క విశిష్టత ఏమిటీ అన్నది తెలుస్తుంది. పంచుకున్నప్పుడే ఆ ఆలోచనలకు సరియైన దిశానిర్దేశం దొరుకుతుంది. నాలో మెదిలే ఆలోచనలు పదిమందితో పంచుకోవాలి అన్న ఉద్దేశ్యంతో వ్రాస్తున్నాను. కాలం గడుస్తున్నకొద్దీ మనుష్యుల బంధువుల/బాధ్యతల పరిధి పెరిగి, మిత్రులతో/భార్యతో/సంతానంతో ఏదైనా పంచుకునే వీలు తగ్గిపోతూ ఉండటం కూడా ఈ రచనకి పురికొల్పింది. ఇక్కడ పరిధి చాలా ఎక్కువ కదా?
ఇందులో నిర్ధిష్టంగా ఫలానా టాపిక్ అంటూ ఏమీ ఎంచుకోవడం జరగలేదు. మదిలో మెదిలే, మనస్సులో అనిపించే ఆలోచనలను యధాతథంగా వ్రాస్తున్నాను. అందులో నన్ను రంజింపజేసిన, లేదా సంతోషపెట్టిన, లేదా బాధపెట్టిన లేదా కదిలించిన అంశాలుంటాయి. ఇలా ఆలోచించేవారు ఎంతోమంది ఉండొచ్చు! కానీ ప్రతీవారు వాటిని వ్యక్తీకరించలేకపోవచ్చు! ఈ బ్లాగ్ అలాంటివారందరినీ ఒక చోట చేరుస్తుందనీ, తద్వారా పంచుకోడానికీ, తర్కించుకోడానికీ అవకాశం దొరుకుతుందని నా ఆశ!
మదిలో ముప్పిరిగొనే ఊహల విహంగాలను ఎగరేయాలనే చిన్ని కోరిక! ఎదలోయలలో/లోతులలో మెదిలే సంగతులని గుదిగుచ్చి, దండలుగా పేర్చాలని ఉంది! నచ్చితే మెచ్చండి, తప్పులుంటే దిద్దండి!!
మీ
వింధ్యారాజ్

Good
రిప్లయితొలగించండి